*రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?*
గృహ వినియోగదారులను సౌర విద్యుత్తు వినియోగం వైపు ప్రోత్సహించి, మామూలు కరెంటు వినియోగాన్ని తగ్గించి వారికి విద్యుత్తు భారం నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్.దీని ద్వారా ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు అమర్చి పగలంతా మీరు సౌర విద్యుత్తు ఉపయోగించుకుని రాత్రి పూట మాత్రం డిస్కంలు సరఫరా చేసే విద్యుత్తును ఉపయోగించుకునేలా చేయడమే ఈ పథకం ప్రత్యేకత.
*ఎవరు అర్హులు?*
ఇల్లు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పథకం పొందడానికి అర్హులు.
ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
మీ ఇంట్లో ప్రస్తుతమున్న ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యథావిధిగా వాడుకునేలా రూపొందించిన పథకం ఇది. ఈ పథకం ప్రత్యేక కూడా ఇదే.
*ఏసీలు, ఫ్రిజ్‌లు అన్నీ కూడా వాడుకోవచ్చా?*
మీరు రోజూ మామూలు కరెంటును ఇంట్లో గృహావసరాలకు ఎలా వినియోగించుకుంటారో.. ఈ సోలార్ పవర్ కూడా అలాగే ఉపయోగించుకుంటారు.
*మీటరు మార్చుతారా?*
అవును. మీ ఇంటికి ఉన్న విద్యుత్తు మీటరు ఒక్కటి మాత్రమే మార్చుతారు. దాని స్థానంలో ఇన్‌పుట్, అవుట్‌పుట్‌ల సదుపాయం రెండూ ఉండే ఒక ప్రత్యేకమైన మీటర్‌ను మాత్ర అమర్చుతారు. మిగిలిన సెటప్ ఏదీ కూడా ఏమాత్రం మార్చరు. మార్చాల్సిన అవసరం లేదు.
*ఆన్ గ్రిడ్ అంటే ఏమిటి?*
క్లుప్తంగా చెప్పాలంటే సోలార్ పవర్, మామూలు కరెంటు రెండూ కూడా వినియోగించుకునే ప్రక్రియ అనొచ్చు. ఈ మీటర్‌కు రెండు ఇన్‌పుట్‌లు ఉంటాయి. మీ ఇంట్లో వైరింగ్ ఏమాత్రం మార్చకుండా కేవలం మీటర్‌ను మాత్రమే మార్చి గ్రిడ్‌కు కనెక్ట్ అవడం. ఒకటి సోలార్ విద్యుత్తు కోసం, రెండోది సాధారణ కరెంటు కోసం..
*ఆన్‌గ్రిడ్ ఎలా పనిచేస్తుంది?*
ఇంటిపైన అమర్చిన సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయ్యే డైరెక్ట్ కరెంటు(DC)ను మీటర్‌లోని ఇన్‌వెర్టర్ ఆల్టర్నేటివ్ కరెంటు (AC)గా మార్చుతుంది.
*సోలార్ పవర్, మామూలు కరెంటు రెండూ ఎలా వాడుకోగలం?*
ఆన్ గ్రిడ్‌లో ఇది సాధ్యమవుతుంది. మీ ఇంటికి సోలార్ ప్యానెళ్లను అమర్చుతారు. దాని ద్వారా పగలంతా ఉత్పత్తయ్యే సోలార్ పవర్‌లో మీరు ఉపయోగించగా మిగిలిన కరెంటు మొత్తం మీ ప్రాంతంలోని డిస్కంలకు చెందిన గ్రిడ్‌కు వెళ్లిపోతుంది.రాత్రిపూట మళ్లీ డిస్కంలు సరఫరా చేసే కరెంటును మీరు యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
*దీనివల్ల ప్రయోజనం ఏమిటి?*
ఫలితంగా కరెంటు బిల్లు ఆరంభంలో గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు మీరు మీ ఇంటిపైన 5 కిలో వాట్‌ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్నారని అనుకుందాం. అది రోజుకు 20 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే మీరు కేవలం 8 యూనిట్లు వాడుకున్నారు. అప్పుడు మిగిలిన 12 యూనిట్ల విద్యుత్తు గ్రిడ్‌కు వెళ్లిపోతుంది. ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అయింది, ఎన్ని యూనిట్లు వాడుకుంది, ఎన్ని యూనిట్లు గ్రిడ్‌కు వెళ్లింది ఈ విద్యుత్తు మీటర్లో నమోదు అవుతుంది.రాత్రిపూట మీట సోలార్ పవర్ ఉండదు కాబట్టి మీరు మామూలు విద్యుత్తు వాడుకుంటారు. రాత్రంతా మీరు ఓ 2 యూనిట్లు వాడుకున్నారనుకోండి. అప్పుడు మీరు మొత్తం 10 యూనిట్ల సోలార్ విద్యుత్తును రోజంతా వినియోగించినట్లు. మిగిలిన 10 యూనిట్లు గ్రిడ్‌కు వెళ్లిపోతుంది. ఈ 10 యూనిట్ల ధరను మీ తదుపరి నెల కరెంటు బిల్లులో అడ్జెస్ట్ చేస్తారు. అలా మీరు తక్కువ వాడి ఎక్కువ యూనిట్లను గ్రిడ్‌కు పంపుతున్నట్లయితే మిగులు విద్యుత్తు యూనిట్లకు డిస్కంలే మీకు తిరిగి డబ్బు చెల్లిస్తాయి.